పెను సంచలనం.. ఐదు రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్ లో బీజేపీని, కాంగ్రెస్ ను వెనక్కి నెట్టిన కాక్రోచ్ పార్టీ

  • ఖాళీగా ఉన్న యువతను ఉద్దేశించి 'బొద్దింక' వ్యాఖ్యలు చేసిన సీజేఐ
  • సీజేఐ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన జెన్ జీ, నిరుద్యోగ యువత
  • కాక్రోచ్ పార్టీని స్థాపించిన అభిజీత్ దిప్కే
  • పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రశాంత్ భూషణ్, మనీష్ సిసోడియా తదితరులు
  • కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతా ఇండియాలో నిలిపివేత

భారతదేశంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి, దాన్ని పెద్ద పార్టీగా చేసేందుకు దశాబ్దాల కాలం పడుతుంది. కేవలం 5 రోజుల్లో... అవును, కేవలం 5 రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను సంపాదించి, ఏకంగా దేశాన్ని ఏలుతున్న అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను దాటేసిన ఒక వింత పొలిటికల్ మూవ్‌మెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


దాని పేరే 'కాక్రోచ్ జనతా పార్టీ' (Cockroach Janta Party - CJP). ఏంటి.. వినడానికి విడ్డూరంగా, ఒక జోక్‌లా ఉందా? కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న యువత, సెలబ్రిటీలు, సీనియర్ లాయర్లు కూడా ఈ పేజీ వైపు చూస్తున్నారు. అసలు ఈ 'కాక్రోచ్' కథ ఎక్కడ మొదలైంది? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? క్లియర్ గా అనలైజ్ చేద్దాం.  


సుప్రీంకోర్టు వ్యాఖ్యలు - యువత ఆగ్రహం:

ఈ కథ మే 15న సుప్రీంకోర్టులో మొదలైంది. ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ కోర్టులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో కొందరు యువకుల ప్రవర్తనను ఉద్దేశిస్తూ ఆయన ఏమన్నారంటే... "సమాజంలో ఉద్యోగాలు లేక, వృత్తిలో మంచి స్థానం సంపాదించుకోలేక, కొంత మంది బొద్దింకల (cockroaches)లాంటి యువకులు తయారవుతున్నారు. వీరంతో సోషల్ మీడియా యాక్టివిస్టులుగా, ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి అందరిపై దాడి చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీజేఐ వ్యాఖ్యలను చాలామంది తప్పుబట్టారు.


ఆ తర్వాత సీజేఐ తన వ్యాఖ్యలపై స్పందిస్తూ... "నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు, సందర్భోచితంగా తీసుకోలేదు" అని క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దేశంలో రాజ్యాంగాన్ని, భావప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిన అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి... ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న యువతను 'బొద్దింకలు' అనడం దేశవ్యాప్తంగా ఉన్న జెన్ జీ, యువతకు కోపం తెప్పించింది.


ఈ కోపంలో నుంచే మే 16న పుట్టుకొచ్చింది 'కాక్రోచ్ జనతా పార్టీ'. పుణేకి చెందిన 30 ఏళ్ల పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దిప్కే (ఈయన గతంలో 2020-2023 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీమ్‌లో కూడా పనిచేశారు) దీనికి ఫౌండర్.  

సీజేఐ అన్న మాటలనే ఒక ఆయుధంలా వాడుకుంటూ... "రండి. దేశంలో ఉన్న సోమరిపోతులు, నిరుద్యోగులు, ఆన్ లైన్లో ఉండే బొద్దింకలంతా ఈ పార్టీలో చేరండి" అంటూ ఒక కటకటాల వెనుక ఉన్న బొద్దింక లోగోతో @cockroachjantaparty అనే ఇన్స్టాగ్రామ్ పేజీని, ఒక వెబ్‌సైట్‌ను క్రియేట్ చేశారు. తమ వెబ్‌సైట్‌లో ఒక ఐదు పాయింట్ల హాస్యాస్పద మేనిఫెస్టోను కూడా పెట్టారు. ఉదాహరణకు... "ఏ చీఫ్ జస్టిస్ కూడా రిటైర్ అయ్యాక రాజ్యసభ సీటు తీసుకోకూడదు" అని డిమాండ్ చేశారు.


ఇది కేవలం ఒక మీమ్ పేజీలా మొదలైనా, దేశంలోని యువతలో ఉన్న నిరుద్యోగ బాధను, ఫ్రస్ట్రేషన్‌ను సరిగ్గా టచ్ చేసింది. దాంతో దీని ఫాలోయింగ్ రాకెట్ లా దూసుకెళ్లింది. కేవలం 5 రోజుల్లోనే 1.47 కోట్ల మంది ఫాలోయర్లను సాధించింది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో బీజేపీకి 88 లక్షల మంది, కాంగ్రెస్ కు 1.33 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.  

దీని వెబ్‌సైట్‌లో ఇప్పటికే దాదాపు 3.5 లక్షల మందికి పైగా యువత రిజిస్టర్ చేసుకున్నారు. కేవలం ఆన్‌లైన్ ట్రెండ్ మాత్రమే కాదు, దీనికి సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్, అలాగే ఆప్ నేత మనీష్ సిసోడియా లాంటి వారు కూడా మద్దతు ప్రకటించారు. ప్రశాంత్ భూషణ్ అయితే ఈ వేదిక ద్వారా నీట్ పేపర్ లీకేజీ ఇష్యూని, ఉద్యోగ హక్కు చట్టం డిమాండ్లను గట్టిగా లేవనెత్తాలని సూచించారు. 


అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇన్ స్టా అకౌంట్ విపరీతంగా దూసుకుపోతున్న తరుణంలో, దీని ఎక్స్ అకౌంట్‌ను భారతదేశంలో నిలిపివేశారు. లీగల్ డిమాండ్స్ కారణంగా అకౌంట్ బ్లాక్ అయినట్లు ఫౌండర్ అభిజీత్ దిప్కే స్వయంగా ప్రకటించారు. మరోవైపు, ఈ పార్టీ కేవలం ఒక ఐదు రోజుల ముచ్చటగా మిగిలిపోతుందా లేక రాబోయే రోజుల్లో యువత గొంతుకగా మారుతుందా అనేది వేచి చూడాలి.


Cockroach Janta Party
CJP
BJP
Instagram
Abhijit Dipke
Supreme Court
youth
unemployment
social media
Prashant Bhushan

More Telugu News